
నెల్లూరులో ప్రముఖ న్యాయవాది కొండ రమేష్ పై రౌడీ మూకలు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇంటిలోకి వెళ్లి మరీ దాడి చేయడం న్యాయవృత్తిదారుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ దాడిలో న్యాయవాది రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాధితుడు రమేష్ ను స్థానికులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కోలుకుంటున్నారు. సకాలంలో సమీప నివాసాల ప్రజలు రాకుండా ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడైన న్యాయవాది కొండా రమేష్ కు అతని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. దాడి ఘటన నుంచి అదృష్టవ శాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కొండ రమేష్ బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు రౌడీ మూకలు, దుండగులు దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు తీవ్రంగా కలవరపడుతున్నారు.
కారణాలు ఏవైనా న్యాయాన్ని నిలబెట్టాల్సిన న్యాయవాదిపై దాడి చేయటానికి యత్నించడం న్యాయవాదుల భద్రతకు తూట్లు పొడిచినట్లే… క్రిమినల్ లాయర్లకు వారి జీవితం కత్తి మీద స్వాము లాంటిదే… ఎక్కువ తీవ్రత కలిగిన నేరాలకు సంబంధించి కేసులను వాదించే క్రిమినల్ లాయర్లకు అడిగిన వెంటనే తాత్సారం చేయకుండా పోలీసు బలగాల భద్రతను కల్పించాలి అని రాష్ట్ర న్యాయవృత్తిదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

Leave a comment